పారితోషికాన్ని తగ్గించుకున్న తమన్నా.. ఎందుకో తెలుసా !

ఆ మధ్య క్రేజీ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు కష్టపడి అవకాశాలను సొంతం చేసుకుంటోందట. అయితే అమ్మడికి మళ్లీ ఆఫర్లు పెరగడం వెనుక అసలు కారణం వేరే ఉందని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అందాల భామలకు అవకాశాలు పెరగడం, తగ్గడం సహజంగానే జరుగుతుంటాయి. అయితే ఆఫర్లు తగ్గిపోతే హీరోయిన్ మళ్లీ పుంజుకోవడం అంత ఈజీ కాదు. అందుకే చాలామంది హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు తెలుగులో అవకాశాలు లేని మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ ఇప్పుడు అవకాశాలు దక్కించుకోవడంలో సక్సెస్ సాధిస్తోంది. 'బాహుబలి 2'లో కొద్ది సేపు కనిపించిన తమన్నాకు ఆ తరువాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో చాలామంది హీరోలు తమన్నాను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే తనకు అవకాశాలు తగ్గడానికి తన రెమ్యూరేషన్ కూడా ఒక కారణమని తెలుసుకున్న ఈ మిల్కీ బ్యూటీ కొద్ది రోజుల నుంచి పారితోషికం విషయంలో డిస్కౌంట్లు ఇవ్వడం మొదలుపెట్టిందట. ఒకప్పుడు కోటి వరకు డిమాండ్ చేసిన తమన్నా ఇప్పుడు తన పారితోషికాన్ని 40 శాతం వరకు తగ్గించుకుందని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు తమ్మూకు పలు ఆఫర్లు వస్తున్నాయని సినీజనం చెప్పుకుంటున్నారు.

రేటు తగ్గించుకుని ఎన్టీఆర్ 'జై లవకుశ'లో ఐటం సాంగ్ చేసిన తమన్నాకు కళ్యాణ్ రామ్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు 'క్వీన్' మూవీ తెలుగు రీమేక్‌లో తమన్నాకు అవకాశం రావడానికి కూడా కారణం ఇదే అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి మిల్కీ బ్యూటీ డిస్కౌంట్ ఆఫర్ కారణంగా ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయని అర్థమవుతోంది.

No comments

Powered by Blogger.